ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రసాయనికి ఆయుధాలు ప్రయోగించే అవకాశం: అమెరికా

international |  Suryaa Desk  | Published : Wed, Mar 16, 2022, 09:11 PM

రష్యాపై అమెరికా తీవ్ర విమర్శలు గుప్పించింది. ఉక్రెయిన్‌పై క్షిపణులు, బాంబులతో విరుచుకుపడి విధ్వంసం సృష్టిస్తున్న రష్యా.. రసాయనిక ఆయుధాలను ప్రయోగించే ముప్పందని అగ్రరాజ్యం అమెరికా తాజాగా హెచ్చరించింది. ఇవన్నీ ఆరోపణలేనని రష్యా కొట్టిపారేస్తున్నా.. ఇటువంటి ఆయుధాల వినియోగంలో మాస్కో గత చరిత్ర తెలిసిన అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఆందోళన చెందుతోంది. సంప్రదాయ ఆయుధాల కంటే రసాయనిక ఆయుధాలు మరింత వినాశకరమైనవి. ఒకప్పుడు శత్రు సైనికులను హతమార్చేందుకు బావులు, చెరువుల వంటి జల వనరులలో విషం కలిపేవారు. ఇందుకోసం ప్రమాదకర ఆర్సెనిక్‌ను ఎక్కువగా వినియోగించేవారు. కాలం మారుతున్న కొద్దీ రసాయనిక ఆయుధాలు మరింత కొత్త రూపును సంతరించుకున్నాయి. రసాయనిక ఆయుధాలను తాకితే చర్మం, పీలిస్తే ఊపిరితిత్తుల్లో బొబ్బలు.. కళ్లలోకి ప్రవేశిస్తే చూపు కోల్పోవడం వంటివి జరుగుతాయి. కొన్ని రకాలు మెదడు నుంచి కండరాలకు సంకేతాలను అందకుండా చేయడం, మరికొన్ని రక్తంలో ఆక్సిజన్‌ సరఫరాను అడ్డుకోవడంతో క్షణాల్లో ప్రాణాలు పోతాయి. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మస్టర్డ్‌ గ్యాస్‌, క్లోరిన్‌లతో కూడిన బాంబులను వినియోగించారు. రెండో ప్రపంచ యుద్ధంలో అనేక మందిని గ్యాస్‌ ఛాంబర్లలో బంధించి దారుణంగా చంపారు. వాస్తవానికి రసాయనిక, జీవ ఆయుధాల వినియోగాన్ని నిషేధిస్తూ 1925లోనే జెనీవా ఒప్పందం జరిగింది. కానీ, అమలు విషయంలో వైఫల్యం చెందింది. 1980ల్లో ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధం సహా పలు సందర్భాల్లో రసాయనిక ఆయుధాలను ప్రయోగించారు. ప్రపంచవ్యాప్తంగా రసాయనిక ఆయుధాల తయారీ, వాడకాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా 1997 నుంచి అమలులోకి వచ్చిన ఒప్పందంపై 193 దేశాలు సంతకాలు చేశాయి. అది కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. అమెరికా సహా చాలా దేశాలు రసాయనిక ఆయుధాలను పెద్దయెత్తున నిల్వ చేసుకున్నాయి. ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభమైన తొలినాళ్లలో మోర్టార్‌ షెల్‌లు, క్షిపణులతో దాడిచేసిన రష్యా.. ఇటీవల నిషేధిత వాక్యూమ్‌ బాంబులను ప్రయోగించింది. రాబోయే రోజుల్లో రష్యా రసాయనిక ఆయుధాలను ప్రయోగించినా ఆశ్చర్యపడక్కర్లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు దశాబ్దాల్లో రష్యా పలుసార్లు వీటిని ఉపయోగించింది. 2002లో రెండో చెచెన్‌ యుద్ధం, 2006లో రష్యా ఫెడరల్‌ సెక్యూరిటీ సర్వీస్‌ మాజీ అధికారి అలెగ్జాండర్‌ లిత్విన్‌ఎంకోపై, సాలిస్బరీలో 2018లో రష్యా మాజీ సైనికాధికారి సెర్గీ స్క్రీపల్‌పై, 2020లో రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్నీపై రష్యన్‌ ఏజెంట్లు రసాయనిక దాడులకు తెగబడ్డారు. రష్యా మద్దతున్న సిరియాలోని బషర్‌ అల్‌ అసద్‌ ప్రభుత్వం స్వదేశీయులపైనే పలుమార్లు రసాయనిక దాడులకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. 2013లో సారిన్‌ వాయువుతో కూడిన రాకెట్లు సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఘూటా ప్రాంతంపై పడ్డాయి. దీంతో ఇళ్లలో నుంచి పరుగులు తీసిన జనం వీధుల్లో చొంగలు కక్కుతూ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 1,700 మందికిపైగా మృతి చెంది ఉండవచ్చని అంచనా. తమ దేశంలో 40 వేల టన్నుల రసాయనిక ఆయుధాలు ఉన్నాయని 1997లో రష్యా ప్రకటించింది. సాలిస్బరీలో మాజీ సైనికాధికారిపై దాడితో తమకు సంబంధం లేదని వాదించింది. అంతేకాదు, రసాయనిక ఆయుధాలను గతంలోనే నాశనం చేశామని పలు సందర్భాల్లో వెల్లడించింది. అయితే, ఇప్పటికీ ఆ దేశం వద్ద భారీమొత్తంలో రసాయనిక ఆయుధాలు ఉన్నాయని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. సోవియట్‌ యూనియన్‌‌లో‌ ఆంత్రాక్స్‌, స్మాల్‌పాక్స్‌ వంటి జీవాయుధాలు చాలా ఎక్కువగా బయటపడిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఉక్రెయిన్‌లోని అమెరికా సాయంతో రసాయనిక, జీవ ఆయుధాల అభివృద్ధి జరుగుతోందంటూ గతేడాది ఆరోపించిన రష్యా.. ఇటీవల యుద్ధం ప్రారంభమైన తర్వాత వాటినే పునరావృతం చేసింది. ఈ వ్యవహారంపై చర్చించేందుకు అత్యవసరంగా భేటీ కావాలని భద్రతామండలిని డిమాండ్‌ చేసింది. అయితే, రష్యా ఆరోపణలను ఉక్రెయిన్, అమెరికా ఖండించాయి. ఉక్రెయిన్‌ ల్యాబొరేటరీలో విషయంలో హడావుడి చేస్తూ ఆ ముసుగులోనే రసాయనిక దాడులకు తెగబడాలనేది పుతిన్‌ సర్కారు వ్యూహమని అమెరికా ఆరోపించింది. మరోవైపు, ఉక్రెయిన్‌‌పై రష్యా రసాయన ఆయుధాలను ఉపయోగించవచ్చని నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఆందోళన వ్యక్తం చేశారు.‘‘మాస్కో ఉక్రెయిన్‌లో రసాయన ఆయుధాలతో దాడులకు పాల్పడవచ్చని మేం ఆందోళన చెందుతున్నాం’’ అని స్టోల్టెన్‌బర్గ్ విలేకరుల సమావేశంలో తాజాగా వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌లో సైనిక జీవసంబంధ కార్యకలాపాలకు అమెరికా నిధులు సమకూరుస్తోందన్న రష్యా వాదనలు అసంబద్ధమని కూడా జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com