పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ ఓ వినూత్న, గొప్ప ఆలోచన చేసింది. భగత్ సింగ్ అసలైన స్పూర్తి నింపే ప్రయత్నం చేసింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘన విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా ఆ పార్టీ నేత భగవంత్ మాన్ బుధవారం ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఎన్నికల ముందు పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్‌ను నిర్ణయించిన విషయం తెలిసిందే. సంప్రదాయాలకు భిన్నంగా స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ స్వగ్రామం ఖతర్ కలన్ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో ఆ గ్రామమంతా పసుపు మయంగా మారింది. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు పసుపు రంగులో ఉండే తలపాగాలు, దుప్పటాలు ధరించి రావాలన్న భగవంత్ పిలుపునకు భారీ స్పందన వచ్చింది. వేదికను కూడా పసుపు వర్ణంలోనే ఏర్పాటుచేశారు. విప్లవానికి ప్రతీకగా భగత్ సింగ్ ఈ రంగు తలపాగాలను ధరించేవారు. ‘‘ఖతర్ కలాన్‌కు బసంతి రంగులు వేద్దాం’ అని భగవంత్ మాన్ తన ప్రమాణ స్వీకారానికి పంజాబ్ ప్రజలను ఓ వీడియో సందేశంలో ఆహ్వానించారు. 1970 తర్వాత సీఎం పగ్గాలు చేపడుతున్న చిన్న వయస్కుడు భగవంత్ మాన్ (48) కావడం విశేషం. పంజాబ్ సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరవుతున్నారు. ఇక, మాన్‌ను తన చిన్న తమ్ముడిగా కేజ్రీవాల్ పిలుస్తుంటారు. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్‌లో ఆప్ 92 సీట్లలో విజయం సాధించింది. సంగ్రూర్ జిల్లాలోని ధౌరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన భగవంత్ మాన్ 60వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ‘‘మార్చి 16న భగత్ సింగ్ స్వగ్రామం ఖతర్ కలాన్‌లో కేవలం భగవంత్ మాన్ మాత్రమే ప్రమాణస్వీకారం చేయడంలేదు.. మూడు కోట్ల మంది పంజాబీలు కూడా పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు..మేమంతా కలిసి షాహీద్ భగత్ సింగ్ కోరుకున్న రంగ్లా పంజాబ్‌ను నిర్మిస్తాం’’ అని ఓ వీడియో సందేశంలో కాబోయే సీఎం పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా విజయం సాధించి, సీఎం పగ్గాలు చేపడుతున్న మాన్.. మంగళవారం లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పంజాబ్‌లో సరికొత్త పాలన మొదలవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో మాకు తెలుసు.. గత ఏడేళ్ల నుంచి లోక్‌సభ సభ్యుడిగానూ ఉన్నారు.. ఢిల్లీలో మా ప్రభుత్వాన్ని ప్రజలు మళ్లీ ఎన్నుకున్నారు.. మాకు చాలా అనుభవం ఉంది.. అనేక మంది రాజకీయ కురువృద్ధులు ఎన్నికల్లో ఓడిపోయి కొత్తవారు ఎన్నికయ్యారు.. రాష్ట్రంలో కొత్త ఆలోచనలు వస్తాయని నేను నమ్ముతున్నాను.. ఈ ప్రభుత్వంలో అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు.