భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వివాహబంధంలోకి అడుగు పెట్టాడు. ఈ నెల 16న హిమానీ మోర్‌తో నీరజ్ చోప్రా పెళ్లి జరిగింది. అయితే, ఈ వివాహ వేడుక కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరగడంతో బయటకు తెలియలేదు. రెండు రోజుల తర్వాత అతనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశాడు. దీంతో నీరజ్ పెళ్లాడిన హిమానీ ఎవరా అని నెటిజన్లు వెతికేపనిలో పడ్డారు. అయితే, ఆమె టెన్నిస్ ప్లేయర్ అని, ఆమెది హర్యానాలోని సోనిపట్ జిల్లా పరిధిలోని లర్సౌలీ అని తెలిసింది. ప్రస్తుతం ఆమె అమెరికాలో చదువుకుంటోంది. వారిద్దరూ మొదట కలుసుకుంది కూడా యూఎస్‌లోనే అలా వారి మధ్య ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారిందని నీరజ్ బంధువు సురేంద్ర చోప్రా చెప్పారు. వారి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకరించడంతో రెండు నెలల కింద పెళ్లి నిర్ణయం తీసుకున్నారని సురేంద్ర తెలిపారు. సిమ్లాలో జనవరి 14 నుంచి 16 వరకు వివాహ వేడుకలు జరిగాయన్నారు. ఇలా నీరజ్ చోప్రా లవ్‌స్టోరీ అమెరికా నుంచి భారత్‌కు వచ్చింది. ఇక టోక్యో ఒలింపిక్స్ 2020లో నీరజ్ చోప్రా ఏకంగా గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గతేడాది పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్ విశ్వక్రీడల్లో సిల్వర్ మెడల్ గెలిచాడు.