ఉత్తర ప్రదేశ్ లో ఓ ఆశ్చర్యానికి గురిచేసే ఘటన నెలకొంది. పోలీసులు ఎక్కడ ఎన్ కౌంటర్ చేసి చంపేస్తారోనని ఉత్తరప్రదేశ్ లోని నేరస్థులు, గూండాలు గజగజ వణికిపోతున్నారిప్పుడు. ఆ భయంతోనే పోలీసులకు లొంగిపోతున్నారు. మామూలుగా అయితే, ఫర్వాలేదుగానీ.. కొందరు గూండాలు తమను షూట్ చేయొద్దు, ప్లీజ్.. లొంగిపోతామంటూ ప్లకార్డులు పట్టుకుంటున్నారు. కిడ్నాపుల కేసుల్లో నిందితుడు, తలపై రూ.25 వేల రివార్డు ఉన్న గౌతమ్ సింగ్ అనే గూండా అదే చేశాడు. ‘‘నన్ను చంపవద్దు. కాల్చి ఎన్ కౌంటర్ చేయొద్దు, ప్లీజ్. నేను లొంగిపోతాను’’ అనే ప్లకార్డును మెడలో వేసుకుని నేరుగా ఛాపియా పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మార్చి 7న ఒక చికెన్ వ్యాపారిని గౌతమ్ సింగ్ కిడ్నాప్ చేశాడని, రూ.20 లక్షలివ్వాలంటూ అతడి కుటుంబానికి ఫోన్ చేసి డిమాండ్ చేశాడని గోండా ఎస్పీ సంతోష్ మిశ్రా చెప్పారు. అతడికి సహకరించిన జుబైర్, రాజ్ కుమార్ యాదవ్ లను అరెస్ట్ చేశామని, గౌతమ్ ను పట్టుకునేందుకు గాలింపు చేపట్టి రూ.25 వేల నజరానా ప్రకటించామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు గాలింపు ముమ్మరం చేయడంతో ఎన్ కౌంటర్ చేస్తారన్న భయంతో తన సోదరుడు అనిల్ తో కలిసి గౌతమ్ లొంగిపోయాడని సంతోష్ మిశ్రా తెలిపారు.