దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసిన కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ప్రోత్సహించే క్రమంలో అస్సా ప్రభుత్వం వినూత్న చర్యలు తీసుకొంది. సినిమా చూసేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు హాఫ్ డే సెలవును ప్రకటిస్తూ అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇలా సినిమా చూసేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వమే స్వయంగా సెలవును ప్రకటించడం విశేషం. ద కశ్మీర్ ఫైల్స్ సినిమా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. కశ్మీర్‌లోని హిందువులపై జరిగిన దారుణాల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ స్వయంగా ఈ సినిమాను వీక్షించారు కూడా. బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్ సహా అనేక బీజేపి పాలిత రాష్ట్రాలు సినిమాపై వినోదపు పన్నును మినహాయిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నసంగతి తెలిసిందే. తాజాగా అస్సాం ప్రభుత్వం ఈ సీనిమాను చూసేందుకు తన ఉద్యోగులకు ఏకంగా హాఫ్ డే లీవ్‌ను ప్రకటించడం గమనార్హం.