ప్రపంచంలో ఎతైన నిర్మాణాలలో ఈఫిల్ టవర్ ఒకటి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ అనగానే టక్కున ఈఫిల్ టవర్ గుర్తొస్తుంది. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా ఈఫిల్ టవర్ ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఫ్రాన్స్ వెళ్లే పర్యాటకులు ఈఫిల్ టవర్ ను సందర్శించందే వెనక్కి రారు. దీని రూపశిల్పి గుస్టావో ఈఫిల్ పేరుమీదే దీనికి నామకరణం చేశారు. పై కొన వరకు దీని ఎత్తు 324 మీటర్లు. ప్యారిస్ నగరంలో ఎక్కడ్నించి చూసినా ఇది కనిపిస్తుంది. తాజాగా ఈఫిల్ టవర్ ఎత్తు పెరిగింది. కొత్తగా ఈ టవర్ అగ్రభాగాన ఓ డిజిటల్ రేడియో యాంటెన్నా ఏర్పాటు చేశారు. దీని పొడవు 6 మీటర్లు. ఓ హెలికాప్టర్ సాయంతో ఈ రేడియో యాంటెన్నాను ఈఫిల్ టవర్ అగ్రభాగాన అమర్చారు. దాంతో ఈఫిల్ టవర్ పూర్తి ఎత్తు 330 మీటర్లకు పెరిగింది. ఈఫిల్ టవర్ బాగా ఎత్తుగా ఉండడంతో దీనికి అనేక టెలివిజన్, రేడియో ట్రాన్స్ మిటర్లు అమర్చారు. చాలాకాలంగా ఇది బుల్లితెర, రేడియో ప్రసారాలకు ఉపకరిస్తోంది.