ఆంక్షలు విధించేది మీరేనా మేమూ విధించగలం అని ఆచరణలో చూపింది రష్యా దేశం. ఉక్రెయిన్ పై దురాక్రమణకు దిగిన రష్యాపై అమెరికా తదితర ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించడం తెలిసిందే. అయితే, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అమెరికాపై రష్యా ఆంక్షలు విధించింది. అదికూడా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ సహా 13 మంది అమెరికా రాజకీయ ప్రముఖులపై ఆంక్షలు విధించింది. వీరిలో అమెరికా గూఢచార సంస్థ సీఐఏ డైరెక్టర్ బిల్ బర్న్స్ కూడా ఉన్నారు. అంతేకాదు, రష్యాపై అమెరికా ఆంక్షల జాబితాను రూపొందించిన దలీప్ సింగ్ అనే భారత సంతతి ఆర్థికవేత్తపైనా పుతిన్ సర్కారు ఆంక్షలు విధించింది. రష్యా ఆంక్షల జాబితాలో అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ సైతం ఉన్నారు. వీరు ఇకపై రష్యాలో అడుగుపెట్టరాదని ఆ ఆంక్షల సారాంశం. కాగా, తనపై నిషేధాన్ని హిల్లరీ క్లింటన్ సరదాగా తీసుకున్నారు. ఈ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుకు రష్యన్ అకాడమీకి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. అటు, ఆంక్షల ప్రకటన సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, తమపై అన్యాయంగా విధించిన ఆంక్షలకు బదులుగానే తాము ఈ చర్యలకు దిగినట్టు వెల్లడించింది. అయితే, మాస్కో వర్గాలు ఈ ఆంక్షలు ప్రకటించిన కాసేపటికే అమెరికా దీటుగా స్పందించింది. ఉక్రెయిన్ పై దండయాత్రలో రష్యాకు సహకరిస్తున్న బెలారస్ పై తాజా ఆంక్షలకు తెరలేపింది. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లూకాషెంకో, మరో 11 మంది రష్యా రక్షణ శాఖ ప్రముఖులను ఆంక్షల జాబితాలో చేర్చింది.