కోర్టు మెట్టు ఎక్కితే ఏ సమస్య అయినా తెగడానికి కాస్త సమయం పడుతుంది. ఇదిలావుంటే అమెజాన్, ఫ్యూచర్ గ్రూపుల మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడప్పుడే తెగేలా కనిపించడం లేదు. ఈ రెండు సంస్థల మధ్య నెలకొన్న వాణిజ్య వివాదం ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరగా.. తాము కోర్టు బయటే చర్చించుకుని సమస్యను పరిష్కరించుకుంటామని రెండు సంస్థలు చెప్పడంతో సుప్రీంకోర్టు కూడా సరేనన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు దఫాలుగా ఈ రెండు సంస్థల మధ్య సుధీర్ఘ చర్చలు జరిగాయి. అయితే ఎలాంటి ఫలితం రాలేదు. వెరసి ఈ రెండు సంస్థల మధ్య చర్చలు ఓ కొలిక్కి రాలేదని, చర్చలు పూర్తిగా విఫలం అయ్యాయని అమెజాన్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు మంగళవారం తెలిపారు. ఫలితంగా సుప్రీంకోర్టు మరోమారు ఈ వివాదంపై దృష్టి సారించక తప్పని పరిస్థితి నెలకొంది. ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్‌ల మధ్య కుదిరిన ఓ ఒప్పందం తన ప్రయోజనాలకు భంగం కలిగిస్తోందంటూ అమెజాన్ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే.