ఈమధ్య.. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో వరుస కార్చిచ్చులు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వందలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. కొందరు ఆ కార్చిచ్చులోనే ప్రాణాలు వదిలేశారు. ఈ నేపథ్యంలోనే.. లాస్ ఏంజెల్స్‌లో చెలరేగిన మంటల్లో చిక్కుకొని ఊరంతా కాలిపోయినా.. ఒక చర్చి మాత్రమే మిగిలిందంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరి వాటిలో నిజమెంతా.. అన్నది ఈ ఫ్యాక్ట్ చెక్‌లో తెలుసుకుందాం.
క్లెయిమ్
"అమెరికాలో లాస్ ఏంజిల్స్ మొత్తం కాలిపోయినా... దేవుని మందిరమైన చర్చి మాత్రం చెక్కు చెదరలేదు" అని చూపిస్తున్న ఫొటో ఫేస్‌బుక్‌లో వైరల్ అవుతోంది.
వాస్తవమేంటంటే..
ఫేస్‌బుక్‌లో వైరల్ అవుతున్న ఈ ఫొటో తప్పు అని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. వైరల్ చేస్తున్న ఈ ఫొటో.. ఏఐ ద్వారా తయారు చేసినట్టుగా నిర్ధారణ అయ్యింది.
ఎలా నిర్ధారించామంటే..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ టెక్నాలజీని ఉపయోగించుకుని గూగుల్‌లో శోధించగా.. లాస్ ఏంజిల్స్ నగరానికి చెందినట్టుగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అగ్నిప్రమాదంలో చర్చి మాత్రమే కాలిపోకుండా ఉంది అని చూపించే కథనాలు కూడా ఏమీ దొరకలేదు.
అయితే.. ఈ ఫొటో బ్యాక్ గ్రౌండ్‌లో ఉన్న చెట్లు, రోడ్డు, సముద్రానికి సంబంధించిన ఆనవాళ్లు అస్పష్టంగా ఉండటం వల్ల.. ఎడిట్ చేసిన ఫొటో కావొచ్చేమో అన్న అనుమానంతో.. Fake Image Detector సాధనాన్ని ఉపయోగించాం. ఈ చిత్రం కంప్యూటర్ రూపొందించిన లేదా సవరించిన చిత్రంలా కనిపిస్తోంది అని తేలింది.
Hive Moderation, wasitai వంటి ఏఐ సవరింపులను గుర్తించే సాధనాలను కూడా ఉపయోగించి పరిశీలించగా, ఈ ఫొటో ఏఐ టెక్నాలజీ ద్వారా తయారు చేసినట్లు నిర్ధారణ అయ్యింది.
ఇది అసలు వాస్తవం....?
దొరికిన ఆధారాలను బట్టి.. ఫేస్ బుక్‌లో వైరల్ అవుతున్న ఫొటో తప్పు అని నిర్ధారణ అయ్యింది. లాస్ ఏంజిల్స్ కార్చిచ్చుకు సంబంధించినది కాదని.. అది పక్కా ఏఐ ద్వారా క్రియేట్ చేసినదిగా తేలింది.