దాదాపు 16 నెలలుగా కొనసాగుతోన్న హమాస్, ఇజ్రాయేల్ యుద్ధానికి బ్రేక్ పడింది. ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8.30 గంటలకే ఇది అమల్లోకి రావాల్సి ఉండగా.. దాదాపు 3 గంటలు ఆలస్యమైంది. బందీల జాబితా విడుదలలో హమాస్ జాప్యం చేయడంతో శాంతి ఒప్పందం అమలుపై ఉత్కంఠ కొనసాగింది. అయితే, చివరకు ముగ్గురు బందీల వివరాలను సోషల్ మీడియా వేదికగా హమాస్ విడుదల చేసింది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందం అమలుకు ఇజ్రాయేల్ సమ్మతించింది. ఈ ముగ్గురు బందీలు మరికొద్ది గంటల్లోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
పలు చర్చలు, సంప్రదింపుల అనంతరం ఇటీవల కాల్పుల విరమణకు ఇజ్రాయేల్- హమాస్‌లు అంగీకారానికి వచ్చిన విషయం తెలిసిందే. కానీ, హమాస్ చెరలోని బందీల జాబితా వెల్లడించేవరకూ ఒప్పందం అమలు చేయబోమని ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ క్రమంలో గాజాపై ఇజ్రాయేల్ సైన్యం దాడులు చేసినట్లు గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ దాడుల్లో గాజా ఉత్తర భాగంలో ముగ్గురు, సిటీలో ఐదుగురు సహా ఎనిమిది మంది చనిపోగా.. మరో 25 మంది గాయపడినట్లు గాజా పౌర రక్షణ విభాగం అధికార ప్రతినిధి మహముద్ బస్సేల్ తెలిపారు. అయితే, సాంకేతిక కారణాలతో బందీల వివరాలు అందజేయడంలో జాప్యం జరిగినట్టు హమాస్ చెప్పింది. వారి వివరాలు వెల్లడించడంతో.. కాల్పుల విరమణ అమలుకు మార్గం సుగమమైంది.
450 రోజులకు పైగా బాంబుల మోత.. క్షిపణుల విధ్వంసం.. తుపాకులు, శతఘ్నుల గర్జనతో రక్తమోడుతోన్న గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో కొంత ఉపశమనం కలగనుంది. శాంతి పవనాలు వీయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఖతార్ రాజధాని దోహా వేదికగా.. అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వంతో నలు చర్చలు, సంప్రదింపుల అనంతరం ఇజ్రాయేల్- హమాస్ మధ్య కాల్పుల ఒప్పందం కుదిరింది. ఇది పాలస్తీనాలోని ప్రజలకు.. హమాస్ చెరలోని దీలుగా ఉన్న వారికి పెద్ద ఊరట. అయితే, ఇది తాత్కాలికమా? శాశ్వతమా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఒప్పందం అమలకు హమాస్, ఇజ్రాయేల్‌లు ఎన్ని రోజులు కట్టుబడి ఉంటాయనేది ఇక్కడ కీలకం.