తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం ఎంతో మంది భక్తులు తిరుమల కొండకు వస్తుంటారు. స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇలా దర్శించుకునే వారిలో కొంతమంది భక్తులు టీటీడీకి విరాళాలు సమర్పించడం తెలిసిన విషయమే. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులకు, అన్నప్రసాదం ట్రస్టుకు విరాళాలు అందిస్తూ తమ వంతు సాయం చేస్తుంటారు. ఈ క్రమంలోనే టీటీడీకి మరో భారీ విరాళం అందింది. చెన్నైకు చెందిన ఓ భక్తుడు టీటీడీకి రూ. 6 కోట్లు విరాళంగా అందించారు. చెన్నైకి చెందిన వర్ధమాన్ జైన్ అనే భక్తుడు ఆదివారం టీటీడీ ట్రస్టులకు రూ.6 కోట్లు విరాళంగా అందజేశారు.
టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఎస్వీబీసీ ఛానెల్ కోసం ఐదు కోట్ల రూపాయలు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు వర్ధమాన్ జైన్ రూ. కోటి రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి వర్దమాన్ జైన్ విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. వర్ధమాన్ జైన్ టీటీడీకి విరాళం అందించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఈయన విరాళాలు అందించినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
మరోవైపు జనవరి 29 నుంచి కడప జిల్లాలోని దేవుని కడప లక్ష్మీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. జనవరి 29 నుండి ఫిబ్రవరి 6 వరకు దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. బ్రహ్మోత్సవాలకు జనవరి 28వ తేదీ సాయంత్రం అంకురార్పణ చేయనున్నారు. జనవరి 29వ తేదీ ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభవుతాయి. ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. ఇందులో పాల్గొనాలనుకునే భక్తులు రూ.300 చెల్లించి పాల్గొనవచ్చని టీటీడీ తెలిపింది. అలాగే ఫిబ్రవరి 7వ తేదీ పుష్పయాగం జరుగుతుందని.. భక్తులు పుష్పాలను సమర్పించవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది.