ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంగా నిలుస్తున్న కుంభమేళాలో నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో గత ఆరు రోజులుగా జరుగుతున్న కుంభమేళాలో నాగసాధువులు తమ వేషధారణ, విన్యాసాలతో అందరి చూపులను తమవైపు తిప్పుకుంటున్నారు. తాజాగా కొందరు నాగసాధువులు కర్రసాము ప్రదర్శించారు. వారిలో ఓ సాధువు అమితవేగంతో కర్రను తిప్పుతూ, దాదాపు శివతాండవాన్ని తలపించాడు. పొడవైన జుట్టుతో ఉన్న అతడు కర్రసాము చేస్తుంటే, శివుడు త్రిశూలంతో నర్తిస్తున్నట్టే అనిపించింది. హరహర మహాదేవ్ శంభో శంకర అంటూ ఇతర సాధువులు నినాదాలు చేస్తుండగా, ఆ నాగసాధువు తన విద్యను అద్భుతంగా ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.