డ్వాక్రా రుణాల చెల్లింపు వ్యవహారంలో ఓ యానిమేటర్ గ్రూప్ సభ్యులకు టోకరా వేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన తొమ్మిది డ్వాక్రా సంఘాలకు సంబంధించి సుమారు రూ. 8 లక్షలను యానిమేటర్ స్వాహా చేసినట్లు సమాచారం. సంఘ సభ్యులు తీసుకున్న రుణాలను నెలనెలా బ్యాంకు ఖాతాలో జమ చేస్తానని నమ్మకంగా తీసుకుని మోసగించినట్లు తెలిసింది. అదేమని యానిమేటర్ ను అడిగితే. అవును డబ్బులు వాడుకున్నా. నిదానంగా చెల్లిస్తా. ఎక్కువగా మాట్లాడితే మీకు చేతనైంది చేసుకోమంటూ సభ్యులకు తేల్చి చెప్పినట్లు పలువురు బాధితులు వాపోతోన్నారు. ఈ విషయాన్ని వెలుగు సీసీ దృష్టికి తీసుకువెళితే ఆ డబ్బులకు మాకు సంబంధం లేదని. కుంభకోణం జరిగిన విషయాన్ని మాకెందుకు తెలియజేయలేదని బాధితులైన సభ్యులపైనే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ కుంభకోణంలో యానిమేటర్ తో పాటు సీసీ పాత్ర కూడా ఉందనే అనుమానం కలుగుతోందని పలువురు బాధిత మహిళా సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని సభ్యులు కోరుతున్నారు.