ఇసుక కొరత కారణంగా పోలవరం ప్రాజెక్టు పనులు మంగళవారం అర్ధాంతరంగా నిలిచి పోయాయి. జేపీ వెంచర్స్ ప్రతినిధులు, మేఘా ఇంజినీరింగ్ అధికారుల మధ్య వివాదంతో పనులపై ప్రతిష్టంభన ఏర్పడింది. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఇసుక తవ్వకాలకు అనుమతి పొందిన జేపీ వెంచర్స్ సంస్థ ప్రతినిధులు మంగళవారం దురుసుగా ప్రవర్తించారు. ఆంధ్రుల జీవనాడిగా పేరొందిన పోలవరం నిర్మాణం విషయంలో వారు వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. తమ అనుమతి లేనిదే ఇసుక తరలింపు చేపట్టనివ్వబోమని, డబ్బులు చెల్లించి ఇసుకను తీసుకెళ్లాలలని వాదించారు. తమకు పర్మిషన్ ఉందని మేఘా ఇంజినీరింగ్ సంస్థ చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. చివరికి అధికారులు జోక్యం చేసుకున్నా జేపీ వెంచర్స్ పట్టు వీడలేదు. ఫలితంగా పోలవరం పనులు చేపడుతున్న మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రతినిధులు పనులు ఆపేశారు. 250 టిప్పర్లను ఇసుక తరలింపు చేపట్టకుండా నిలిపివేశారు. తాజా వివాదంపై బుధవారం జేపీ వెంచర్స్ సంస్థ స్పందించింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. పోలవరం నిర్మాణంలో ఆటంకం కలిగినందుకు క్షమాపణ చెప్పింది. క్షేత్రస్థాయిలో సమన్వయ లోపం కారణంగా ఈ వివాదం ఏర్పడిందని పేర్కొంది. దీంతో యథావిధిగా పోలవరం పనులు మొదలయ్యాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa