ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీజీహెచ్‌ వైద్యుల్లో బదిలీల కలకలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 24, 2022, 08:37 AM

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం బుధవారం 75 మందిని బదిలీ చేసింది. ఈ ప్రక్రియ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి, కళాశాలలో కలకలం రేపింది. కీలక విభాగాలకు చెందిన ఏడుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను దూర ప్రాంతాలకు బదిలీ చేశారు. దీంతో వారు గుంటూరు వదిలేందుకు సిద్ధంగా లేరని ఆస్పత్రిలో ప్రచారం జరుగుతుంది. వారంతా ప్రైవేటు చికిత్సలతో స్థానికంగా స్థిరపడిపోవడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. గుంటూరు ఆసుపత్రికి బదిలీపై వచ్చేవారి పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంది. ఈ పరిస్థితుల్లో జీజీహెచ్‌లో చికిత్సలపై తీవ్ర ప్రభావం పడుతోందని రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


మరో రెండు రోజుల్లో ప్రొఫసర్లకు స్థానచలనం కలగనుంది. ఈ పరిస్థితుల్లో మరెంతమందిపై బదిలీ వేటు పడుతుందోనని ఆయా విభాగాలకు చెందిన వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో జీజీహెచ్‌ న్యూరోసర్జరీ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్‌ హనుమ శ్రీనివాసరెడ్డి బదిలీ ఉత్తర్వులు రాగానే ప్రిన్సిపాల్‌కు రాజీనామా పత్రాన్ని అందజేశారు.


మరో ముగ్గురు వైద్యులు కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. డాక్టర్‌ హనుమ శ్రీనివాసరెడ్డి బాహుబలి సినిమా చూపిస్తూ మెదడులో కీ హోలు సర్జరీ ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో జరగని చికిత్సలు కూడా జీజీహెచ్‌లో ఆయన విజయవంతం చేశారు. దీంతో ఆయన ప్రభుత్వ సేవలను వదులుకునేందుకు సిద్ధపడ్డారని సమాచారం.


బుధవారం బదిలీ ఉత్తర్వులు అందుకున్న కొందరు వైద్యులు చివరి ప్రయత్నంగా రాజకీయ నాయకులతో సిఫార్సులు చేయించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ ప్రయత్నాలు విఫలమైతే రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బదిలీ అయిన వారు చార్జి తీసుకునేందుకు ప్రభుత్వం కేవలం 24 గంటల సమయమే ఇచ్చింది. దీంతో బుధవారం మెడికల్‌ కళాశాలలో అంతా గందరగోళం నెలకొంది. ఈ ప్రభావం ఆసుపత్రిలో చికిత్సలపై పడింది. కీలకమైన విభాగాల్లో సర్జరీలు కూడా వాయిదా వేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa