శ్రీలంకలోని ప్రస్తుత దుస్థితికి నిదర్శనం ఈ ఘటన. ఆ దేశంలో యాభైశాతం మంది ప్రజలు రోజుకు ఒక పూట భోజనంతోనే సరిపుచ్చుకొంటున్నారటా. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాల్చుతోంది. అధ్యక్షుడు గొటబయా రాజపక్స నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. సంకీర్ణ ప్రభుత్వం నుంచి 41 మంది బయటకు రావడంతో గొటబయా రాజీనామా చేయాలని మాజీ మిత్రులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్థిక మంత్రిగా సోమవారం బాధ్యతలు చేపట్టిన అలీ సాబ్రే ఒక్క రోజులోనే తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని మహింద్ రాజపక్స క్యాబినెట్‌లోని 26 మంది మంత్రులూ మూకుమ్మడిగా ఆదివారం రాత్రి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సోమవారం తన మంత్రివర్గంలోకి మహింద్ నలుగుర్ని తీసుకున్నారు. వీరిలో అలీ సాబ్రే ఒకరు. అటు, తమ ప్రభుత్వంలో చేరాలని అధ్యక్షుడు గొటబయా రాజపక్స ఇచ్చిన ఆఫర్‌ను ప్రతిపక్షాలు తిరస్కరించాయి. అంతేకాదు, ఆయనను పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశాయి. ఎమర్జెన్సీ ప్రకటన తర్వాత తొలిసారి మంగళవారం పార్లమెంట్ సమావేశం కాగా.. డిప్యూటీ స్పీకర్ రంజిత్ సియామ్‌బలాపిటియా రాజీనామా చేశారు. అలాగే, శ్రీలంక కేంద్ర బ్యాంకు గవర్నర్ అజిత్ కబ్రాల్ కూడా బాధ్యతలు నుంచి తప్పుకున్నారు.
ఆర్థిక సంక్షోభం కారణంగా నిత్యాసరాల కొరత, ధరలు కొండెక్కి కూర్చోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అధికారంలోని ఉన్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఆందోళనలను ఉక్కుపాదంతో అణిచివేయడానికి శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీని విధించింది. రాజపక్స కుటుంబం అధికారం నుంచి దిగిపోవాలని దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి.
మరోవైపు, శ్రీలంకలో రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని నిశితంగా గమనిస్తున్నామని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ మంగళవారం వెల్లడించింది. గొటబయా రాజపక్స రాజీనామా చేయాలంటూ వేలాదిగా ప్రజలు రోడ్లపైకి వచ్చిన నిరసనలు తెలుపుతున్నారు. రెండేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చిన గొటబయా ప్రభుత్వం విధానాలే ఈ దుస్థితికి కాణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆహార పదార్థాల కొరతతో 50 శాతం మంది కేవలం ఒక పూట భోజనంతో సరిపెట్టుకుంటున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 55 శాతం మంది ప్రజలు దినసరి వేతన కార్మికులే. రూ.22 వేల జీతంతో నెల రోజులపాటు నిత్యవసరాలు పొందేవారు. అయితే ధరల పెరుగుదలతో ఈ జీతం రెండు వారాలకు మాత్రమే సరిపోతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa