పాకిస్తాన్ ప్రధానిగా ఎన్నికైన వెంటనే షహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పాక్ నేషనల్ అసెంబ్లీలో సోమవారం ఆయన ప్రసంగించారు. భారత్‌తో దౌత్య సంబంధాలు మెరుగు పడాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. అయితే కాశ్మీర్ అంశం పరిష్కారం కానంత వరకు ఇరు దేశాల మధ్య చర్చలతో ఉపయోగం ఉండదన్నారు. కాశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దు చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. కాశ్మీర్ ప్రజలు రక్తమోడుతున్నారని, వారికి పాకిస్థాన్ నుంచి అవసరమైన దౌత్య మద్దతు అందిస్తామని చెప్పారు. కాశ్మీర్ విషయంలో భారత ప్రధాని మోడీ చర్చలకు రావాలన్నారు. పఠాన్‌కోట్‌లో పాక్ ఉగ్రమూకల దాడి అనంతరం ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. 2019లో 370 ఆర్టికల్‌ను భారత్ రద్దు చేసింది. దీనిని తట్టుకోలేని పాక్ తమ దేశంలోని భారత రాయబారిని బహిష్కరించింది. భారత్‌తో సరిహద్దు మూసేయడంతో పాటు, వాయు మార్గాలపై ఆంక్షలు విధించింది.