భారతదేశంలో మతం ఆధారంగా సాగుతున్న ధారుణాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌లో ‘మానవహక్కుల ఉల్లంఘనలు’ పెరుగుతున్నాయంటూ కొంత మంది అధికారులు ఎత్తిచూపుతున్న అంశాన్ని నిశితంగా గమనిస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకేన్ అన్నారు. భారత్‌లో మానవహక్కుల ఉల్లంఘనపై ప్రత్యక్షంగా అమెరికా వ్యాఖ్యలు చేయడం చాలా అరుదు. ఈ నేపథ్యంలో బైడెన్, మోదీ వర్చువల్ భేటీ అనంతరం అమెరికా చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. సోమవారం అమెరికా, భారత్ రక్షణ, విదేశాంగ మంత్రుల ద్వైపాక్షిక సమావేశం అనంతరం సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆంటోనీ బ్లింకేన్ మాట్లాడుతూ.. ‘‘మేము ఈ విలువలపై (మానవ హక్కుల) మా భాగస్వామి భారత్‌తో కలిసి పనిచేస్తాం.. కొంతమంది ప్రభుత్వ, పోలీసులు, జైలు అధికారుల వల్ల మానవ హక్కుల ఉల్లంఘనల పెరుగుదల సహా భారతదేశంలో ఇటీవలి కొన్ని పరిణామాలను మేం నిశితంగా గమనిస్తున్నాం’’ అని తెలిపారు. అయితే, ఈ అంశంపై బ్లింకేన్ విస్తృతంగా మాట్లాడలేదు.
సంయుక్త సమావేశంలో మానవహక్కుల ఉల్లంఘన గురించి బ్లింకెన్ ప్రస్తావనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జై శంకర్‌లు ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని విమర్శించడానికి బైడెన్ ప్రభుత్వం విముఖత చూపుతోంది? అని అమెరికా ప్రతినిధి ఇల్హాన్ ఒమర్ విమర్శించిన విషయం తెలిసిందే. ఆమె విమర్శలు చేసిన కొద్ది రోజులకే బ్లింకెన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
దేశంలో పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను సవాల్ చేసేలా మతమార్పిడి చట్టాలను తీసుకురావడం లేదా పరిశీలించడం చేస్తున్నాయి. ఇక, 2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 370ను భారత్ రద్దు చేసి, ఆ ప్రాంతాన్ని పూర్తిగా భారత్‌లో విలీనం చేశారు.
అలాగే, 2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం భారత లౌకికవాదాన్ని ఉల్లంఘించేదిగా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. 2015కు ముందు అఫ్గన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో నిరాదరణకు గురై భారత్‌కు వలసవచ్చిన హిందూ, జైన్, పార్శీ, బౌద్ధులు, క్రైస్తవులు, సిక్కులకు భారత పౌరసత్వం కల్పించేలా చట్టంలో సవరణ చేశారు.
దీనిని నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సీ) అమలుకు తొలి అడుగు అని పలువురు ఆరోపించారు. అయితే, CAA, NRC మధ్య ఎటువంటి సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇటీవల కర్ణాటకలో హిజాబ్ వివాదం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఉడుపిలో మొదలైన వివాదం రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తలకు కారణమై.. ఇతర రాష్ట్రాలకూ వ్యాపించింది.