కఠిన చట్టాలను ప్రభుత్వం రూపొందించినా దేశంలో మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఒంటరిగా కనిపించిన మహిళలపై దుండుగులు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. అయితే కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. ఇదే కోవలో సినిమా చూసి బయటకు వచ్చిన మహిళా డాక్టర్‌ను దుండగులు అపహరించి, సామూహిక అత్యాచారం చేశారు. ఓ కేసును పోలీసులు విచారిస్తున్న క్రమంలో నిందితుల దారుణం బయటపడింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
తమిళనాడులోని వేలూరు జిల్లా కాట్పాడి–తిరువలం రోడ్డులోని ఒక సినిమా థియేటర్‌లో మార్చి 17న ఓ మహిళా డాక్టర్ తన స్నేహితుడితో కలిసి సినిమాకు వెళ్లింది. అనంతరం రాత్రి 1 గంటకు వారిద్దరూ ఇంటికి చేరుకునేందుకు ఓ ఆటోను ఆపారు. ఐదుగురు నిందితులు మహిళా డాక్టర్ మెడపై కత్తి పెట్టి బెదిరించారు. ఆటోలో ఎక్కించుకుని, నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను ఏటీఎం వద్దకు తీసుకెళ్లి, ఆమె ఖాతా నుంచి రూ.40 వేలు డబ్బులు డ్రా చేయించారు. డబ్బుతో పాటు ఆమె వద్ద ఉన్న బంగారాన్ని తీసుకుని పరారయ్యారు.
అనంతరం డబ్బులు పంపిణీలో నిందితుల మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, అత్యాచారం విషయం బయటపడింది. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించి, బాధితురాలు వేలూరులోని ప్రముఖ ఆసుపత్రిలో పని చేస్తోందని తెలుసుకున్నారు. ఆమె ద్వారా ఆన్‌లైన్ విధానంలో శుక్రవారం ఫిర్యాదును స్వీకరించి, నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితులు పార్తీబన్(20), సంతోష్‌కుమార్(22), భరత్(18), మణిగండన్(22), 17 ఏళ్ల మైనర్ బాలుడిని అరెస్ట్ చేశారు. మైనర్ నిందితుడిని చెన్నైలోని బాలుర శిక్షణా కేంద్రానికి తరలించారు.