రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో 'గరాసియా తెగ' విస్తరించి ఉంది. వీళ్ల సంప్రదాయం ప్రకారం యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు తమకు నచ్చిన అబ్బాయిని ఎంచుకోవచ్చు. ఇందుకోసం నిర్ణీత వ్యవధుల్లో రెండు రోజుల పాటు ఓ జాతర జరుగుతుంటుంది. ఇందులో భాగంగా తమకు నచ్చిన అబ్బాయిని ఎంచుకొని పెళ్లితో సంబంధం లేకుండా అతడితో సహజీవనం చేయొచ్చు. ఇందుకు అబ్బాయి కొంత సొమ్మును అమ్మాయి కుటుంబానికి ఇస్తారు. ఇది ఒక రకంగా ఎదురుకట్నం/కన్యాశుల్కంలా చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో ఈ జంట పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే అప్పుడు పెళ్లి ఖర్చులు కూడా వరుడి కుటుంబ సభ్యులే భరిస్తారట. ఈ ఆచారం ఇక్కడ దశాబ్దాలుగా కొనసాగుతోంది.
ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి ఏళ్ల పాటు సహజీవనం చేసే ఆచారం ఈ తెగలో ఉంది. ఈ క్రమంలో పిల్లల్ని కనచ్చు. ఆ తర్వాత ఆర్థికంగా స్థిరపడి ఏ లోటూ లేకుండా కుటుంబాన్ని పోషించగలమన్న ధీమా ఏర్పడ్డాకే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకోవచ్చట. ఈ పద్ధతిని 'దాపా'గా పిలుస్తారు. పెరిగి పెద్దై సహజీవనం చేస్తోన్న తమ పిల్లలే వృద్ధ తల్లిదండ్రులకు పెళ్లి చేయడం లాంటి ఘటనలు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. పైగా సహజీవనంలో ఉన్న భాగస్వామి తమను వేధించినా, ఇకపై అతడితో కొనసాగలేమని నిర్ణయించుకున్నా అతనితో విడిపోయే హక్కు ఇక్కడి మహిళలకు కల్పించారు.
గరాసియా తెగ పాటిస్తోన్న ఈ ఆచారాలన్నీ కొన్ని శతాబ్దాలకు పూర్వమే ప్రారంభించారు. వాటినే ఈ తరం వారూ కొనసాగిస్తున్నట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ ఆచారాలే వరకట్న వేధింపులు, మరణాలు, అమ్మాయిలపై అత్యాచారాలు వంటివెన్నో తగ్గించాయని అక్కడి వారు చెబుతున్నారు.