‘కచిడి’.. నిజంగా బంగారం లాంటి చేపే.. వలలో పడిందా లక్షల రూపాయలు వచ్చినట్టే. ఆహారంగా ఆడ చేపలు అద్భుతమైన రుచిని అందిస్తే.. ఇక మగ చేపలు ఔషధాల తయారీలో, ఖరీదైన వైన్‌ను శుభ్రం చేయ డంతోపాటు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో కచిడి చేపకు విపరీతమైన డిమాండ్ ఉంది. గోదావరి జిల్లాల్లో కనిపించే ఈ చేప మత్స్యకారులకు సిరులు కురిపిస్తోంది.
సాక్షి కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లాలోని తొండంగి, అద్దరిపేట నుంచి సఖినేటిపల్లి, పల్లిపాలెం, పశ్చిమగోదావరి జిల్లాలోని పేరుపాలెం, నరసాపురం తదితర ప్రాంతాల నుంచి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులలో అదృష్టవంతుల వలకే కచిడి చేప చిక్కుతుందంటుంటారు. ఈ కచిడి చేపను బ్లాక్ స్పాటెడ్ (క్రోకర్) లేదా సీగోల్డ్, గోల్ ఫిష్‌గా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం.. ప్రోటోనిబియా డియాకాన్తస్. ఇండో ఫసిఫిక్, బంగాళాఖాతంలోని లోతు జలాల్లో మాత్రమే కచిడీ జీవిస్తోంది. ఈ రకం చేపలకు ప్రకృతి ప్రసాదించిన వాయుకోççశం (ఎయిర్ బ్లాడర్) ఉండటంతో సముద్రాలను ఈదడంలో ఇవి మహా నేర్పరులు.
ఈ చేపలను కాకినాడ, ఓడలరేవు, ఉప్పాడ, పల్లిపాలెం తదితర ప్రాంతాల్లో స్థానిక మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. ఈ చేపలకున్న డిమాండ్ దృష్ట్యా వీటి కొనుగోలుకు అటు ఉత్తరాంధ్ర.. ఇటు నెల్లూరు జిల్లా నుంచి ఎగుమతిదారులు స్థానిక మార్కెట్ల్లకు క్యూ కడుతున్నారు. ఈ చేప 40 కిలోల వరకు బరువు ఉంటోంది. 10 కిలోలు దాటితే రూ.లక్ష నుంచి రూ.4 లక్షలకు అమ్ముడుపోయిందంటే వీటికి డిమాండ్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు.