ఏపీ సీఎం జగన్ సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. కోర్టు వివాదాల్లో ఇళ్ల స్థలాలపై తక్షణమే ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కేసుల పరిష్కారంలో జాప్యం జరిగే సూచనలు ఉన్న ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించే కార్యక్రమం చేపట్టాలన్నారు. పట్టాల పంపిణీ పూర్తి కాగానే విశాఖలో 1.43 లక్షల మందికి ఇళ్ల నిర్మాణాలు జూన్ నాటికి ప్రారంభమవుతాయని, కోర్టు వివాదాల అనంతరం అందజేసేందుకు సర్వం సిద్ధమైందని అధికారులు తెలిపారు. భూమిని చదును చేయడంతో పాటు అప్రోచ్ రోడ్ల నిర్మాణం, లే అవుట్లలో నీరు, విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
ఇళ్లకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని సీఎం జగన్ అన్నారు. బల్బులు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అన్నీ నాణ్యతతో ఉండాలని, నాసిరకం పరికరాలు కొనుగోలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. నాణ్యతా ప్రమాణాలు ఉన్న వాటినే కొనుగోలు చేయాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే నాటికి జగనన్న కాలనీల్లో కనీస మౌలిక వసతులైన తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు.జగనన్న సంపూర్ణ గృహ హక్కుల పథకంపై సీఎం జగన్ సమీక్షించారు. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోని వారు వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.