ఫుట్బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇంట విషాదం నెలకొంది. అప్పుడే పుట్టిన కవలల్లో మగబిడ్డ మరణించినట్లు రొనాల్డో దంపతులు ప్రకటించారు. "మా మగబిడ్డ చనిపోయాడని బాధతో ప్రకటిస్తున్నాం. ఇది ఏ తల్లిదండ్రులైనా అనుభవించలేని గొప్ప బాధ" అని రొనాల్డో, రోడ్రిగ్జ్ దంపతులు సోషల్ మీడియా వేదికగా సోమవారం ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులను సొంతం చేసుకున్న క్రిస్టియానో రొనాల్డో తమకు కవలలు పుట్టబోతున్నారని గత అక్టోబర్లో ప్రకటించారు. అయితే పుట్టిన కవలల్లో ఆడబిడ్డ బ్రతకడం తమకు కొంత ఆశ, ఆనందంతో జీవించే శక్తిని ఇస్తుందని రొనాల్డో దంపతులు పేర్కొన్నారు. తమ చిన్నారుల సంరక్షణకు పాటుపడిన వైద్యులు, నర్సులకు ధన్యవాదాలు తెలియజేశారు. స్పానిష్ మోడల్ జార్జినా రొడ్రిగ్తో రొనాల్డొ కొన్నేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నాడు. వీరికి నవంబర్ 12, 2017న కుమార్తె అలనా మార్టినా జన్మించింది. తాజాగా కవలలు జన్మించగా అందులో కొడుకు చనిపోవడం వీరిని విషాదంలో ముంచెత్తింది.