అవినీతికి తావులేకుండా కుల మత రాజకీయాలకు అతీతంగా వాలంటీర్ల వ్యవస్థ పనిచేస్తుందని రాజోలు ఎంఎల్ఎ రాపాక వరప్రసాదరావు అన్నారు. మంగళవారం రాజోలు మండలం కడలి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ప్రతి శాఖ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ చేరవేస్తోందన్నారు. సేవా దృక్పధంతో వాలంటీర్లు పనిచేస్తున్నారన్నారని, వాలంటీర్లకు ఎన్ని సన్మానాలు చేసినా వారి రుణం తీర్చుకోలేనిదని పొగిడారు.
ప్రజలకు- ప్రభుత్వానికి మధ్య వాలంటీర్ ఒక వారధిలా పనిచేస్తున్నారని అన్నారు. ప్రజల వద్దకు పరిపాలనను చేరవేయడంలో వాలంటీర్ చేసే కృషి మరువలేనిదని, కోవిడ్ సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వాలంటీర్ సేవలందించాడని, ఒక విప్లవాత్మకమైన మార్పులు చేస్తూ వాలంటీర్ వ్యవస్థను సీఎం జగన్ ప్రవేశపెట్టడం జరిగిందని, దేశం మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా వాలంటీర్ వ్యవస్థ ఏర్పడిందని అన్నారు.
కుల, మత, ప్రాంతాలకు అతీతంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేవలందిస్తున్నామని, ప్రతిపక్షాలు వాలంటీర్ వ్యవస్థను చూసి అవహేళనగా మాట్లాడారని అన్నారు. ఈరోజు వాలంటీర్ అందిస్తున్న సేవలను చూసి విపక్షాలు సిగ్గుపడుతున్నయని, సేవేపరమావధిగా , లంచాలకు అవకాశం లేకుండా వాలంటీర్లు సేవలందిస్తున్నారని అన్నారు. అనంతరం 11 సచివాలయ వాలంటీర్లకు సేవారత్న, సేవామిత్ర, సేవావజ్ర పురస్కారాలను అందించి వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజోలు ఎంపిపి కేతా శ్రీనివాస్, జెడ్పిటిసి మట్టా శైలజ, వైసిపి నాయుకులు కె. ఎస్. ఎన్ రాజు, వైస్ ఎంపిపి ఇంటిపల్లి ఆనందరాజు, ఎంపిడిఒ కెఆర్ విజయ, సర్పంచ్ లు చొప్పల గుణనాధ్, కోటిపల్లి రత్నమాల, కుక్కల బేబి కుమారి, ఎంపిటిసి అంబటి అరుణ, రాపాక వెంకటరామ్, కంచర్ల శేఖర్, కూనపరెడ్డి రాంబాబు పలువురు పాల్గొన్నారు.