పునమి చంద్రడు, అమవాస్య చంద్రుడు ఎలా ఉంటాడు అంటే టక్కున ఎవరైనా ఇలా ఉంటాడు అని సమాధానమిస్తాడు. దానికి ఆధ్యాత్మికతను కూడా జోడిస్తారు. 15 రోజులు నిండు పున్నమితో చందమామ వెలిగిపోతుంటాడు.. ఇంకో పక్షం దినాలు అమావాస్య చీకట్లో మగ్గిపోతుంటాడు! మరి, చందమామకు ఆ రెండు మొహాలు ఎందుకున్నాయో ఎప్పుడైనా మెదడులో ప్రశ్న తిరిగిందా! కొన్ని వందల ఏళ్ల నుంచే శాస్త్రవేత్తలు ఆ ప్రశ్నకు సమాధానం దొరకబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. రెండు వైపులా ఎందుకు వేర్వేరుగా ఉంటోందన్న దానిపై పరిశోధనలు చేస్తున్నారు.
దానికి తాజాగా సమాధానం గుర్తించినట్టు చెబుతున్నారు. 430 కోట్ల ఏళ్ల క్రితం చందమామను ఓ గ్రహ శకలం ఢీకొట్టడంలోనే దాని రహస్యమంతా దాగుందని అంటున్నారు. భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడి మొహాన్ని ఆ ప్రభావమే తీవ్రంగా మార్చిందంటున్నారు. నాసా జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ, స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ, పర్డ్యూ యూనివర్సిటీ, బ్రౌన్ యూనివర్సిటికీ చెందిన శాస్త్రవేత్తలు కలిసి పరిశోధన చేసి తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు.
గ్రహ శకలం ఢీకొట్టడం వల్లే చందమామపై అతి కష్టమైన, కఠినమైన దక్షిణ ధృవ బేసిన్ ఏర్పడిందని బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన పీహెచ్ డీ స్కాలర్, పరిశోధనకు నేతృత్వం వహించిన మ్యాట్ జోన్స్ చెప్పారు. ఆ ఇంపాక్ట్ వల్ల సౌర వ్యవస్థలోనే రెండో అతిపెద్ద గొయ్యి చందమామపై ఏర్పడిందన్నారు. గ్రహ శకలం ఢీకొట్టడం వల్ల భారీ స్థాయిలో వేడి చందమామ లోపలికి వెళ్లిందన్నారు.
అయితే, ఆ ప్రభావం చంద్రుడి దగ్గరవైపు (మనకు కనిపించేది– పున్నమి చంద్రుడు) ఎక్కువగా పడిందని, కొన్ని అరుదైన మూలకాలు, వేడి మూలకాలు పేరుకున్నాయన్నారు. వాటి వల్ల ఏర్పడిన అగ్నిపర్వత పేలుళ్లతో మనకు కనిపించే వైపు భారీ గోతులు ఏర్పడి ఉంటాయన్నారు. గ్రహ శకలం ఢీకొట్టినప్పుడు భారీగా ప్రవహించిన లావా.. దగ్గరివైపు అప్పటికే ఏర్పడిన గోతుల్లోకి చేరిందని చెప్పారు. అందుకే మనకు కనిపించే వైపు చందమామ ఆకర్షణీయంగా.. కనిపించని వైపు చీకటిగా ఉంటుందని అంటున్నారు.