జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు క్రియాశీలక జనసైనికుల కుటుంబాలను పరామర్శించి, ఆర్ధిక సాయం చెక్కులు అందిస్తారని వెల్లడించారు. హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఉదయం తెలంగాణ నాయకులు, వీరమహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ "తెలంగాణ ప్రాంతమన్నా, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలన్నా అధ్యకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చాలా మక్కువ. ఈ ప్రాంత పోరాటపటిమను స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రతి సమావేశంలో ఆయన ప్రస్తావిస్తూనే ఉంటారు. ఈ ప్రాంతంలో పేదరికం, వెనుకబాటుతనం, సమస్యలు స్వయంగా చూశారు. ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితులు ఆయనకు తెలుసు. అందుకనే ఆదిలాబాద్ తండాలో అక్కడి మహిళలు అడగ్గానే మంచినీటి బోరు ఏర్పాటు చేశారు. కోరుకుంటే నాయకత్వం రాదు. దానికోసం మనస్పూర్తిగా కష్టపడాలి. ఒక ప్రణాళికతో వ్యూహాత్మకంగా ప్రజా సమస్యలపై గళం వినిపించాలి. అప్పుడు సమస్యలపై అవగాహన పెరగడంతో పాటు ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. చౌటుప్పల్, హుజూర్ నగర్ ప్రాంతాలకు చెందిన శ్రీ సైదులు, శ్రీ కడియం శ్రీనివాస్ అనే జనసైనికులు పార్టీ కోసం క్షేత్రస్థాయిలో ఎంతో శ్రమించారు. పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని నమ్మి మనతో పాటు ఇన్నాళ్లు ప్రయాణించారు. ఇటీవల ప్రమాదవశాత్తు వాళ్లిద్దరు మరణించారు. ఆ కుటుంబాలను ఆదుకొని, వారికి భరోసా కల్పించే బాధ్యత మనపై ఉంది. మరో వారం పది రోజుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆ కుటుంబాలను పరామర్శించి, బీమా సాయం అందిస్తారు అని తెలియచేసారు.