నెల్లూరు జిల్లా కోర్టులో ఫైల్ దొంగతనంపై స్పందించిన ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి విచారణలో అసలు వాస్తవాలు బయటపడతాయని పేర్కొన్నారు. ఏపీ హోం శాఖ మంత్రిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన తానేటి వనితను మంగళవారం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా హోం మంత్రితో ఆయన పలు అంశాలపై చర్చించారు. చర్చల్లో భాగంగా ఫ్రెండ్లీ పోలిసింగ్‌ను పక్కాగా అమలు చేయాలని ఇద్దరూ నిర్ణయించారు. హోం మంత్రితో భేటీ అనంతరం రాష్ట్రంలో చోటుచేసుకున్న పలు కీలక ఘటనలపై డీజీపీ స్పందించారు. అందులో భాగంగానే నెల్లూరు కోర్టులో జరిగిన చోరీపైనా ఆయన స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే... ఈ కేసులో సాక్ష్యాల ఆధారంగానే ముందుకు వెళ్లాం. విచారణలో అసలు వాస్తవాలు బయటపడతాయి. ఈ కేసుకు సంబంధించి ఎవరి వద్దనైనా ఆధారాలు ఉంటే ఇవ్వాలని సమన్లు జారీ చేశాం. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేపట్టాం అని ఆయన పేర్కొన్నారు. ఇక అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో చిన్నారి మృతి ఘటనపైనా డీజీపీ స్పందించారు. చిన్నారిని తీసుకెళ్లే సమయానికి మంత్రి ఉషాశ్రీ చరణ్ ర్యాలీకి గంట సమయం తేడా ఉందని డీజీపీ తెలిపారు.