కరోనా మరోసారి క్రీడా రంగంపై పంజా విసిరింది. దీంతో ఐపీఎల్ మ్యాచ్ లపై సంసిగ్ధత నెలకొనబోతోందా అన్న ఆందోళన క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. సాఫీగా సాగుతోందని భావించిన ఐపీఎల్ తాజా సీజన్ లోనూ కరోనా కలకలం చెలరేగింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఫిజియో ప్యాట్రిక్ ఫర్హార్ట్ తో పాటు ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ కూడా కరోనా బారినపడడం ఐపీఎల్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం మార్ష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఫర్హార్ట్ ఐసోలేషన్ లో ఉన్నాడు. అయితే, రేపు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ ఆడాల్సి ఉండగా, ఈ మ్యాచ్ నిర్వహణపై సందేహాలు ముసురుకున్నాయి. వీటికి ఐపీఎల్ పాలకమండలి తెరదించింది.
ఈ మ్యాచ్ జరుగుతుందని స్పష్టం చేసింది. అయితే మ్యాచ్ వేదికను పూణే నుంచి ముంబయికి మార్చినట్టు వెల్లడించింది. ఈ మ్యాచ్ కు ఇక్కడి బ్రాబౌర్న్ స్టేడియం ఆతిథ్యమివ్వనున్నట్టు తెలిపింది. షెడ్యూల్ ప్రకారం పూణే వెళ్లాల్సిన ఢిల్లీ జట్టును ముంబయిలోనే ఉంచారు. ఈ సాయంత్రం ముంబయిలోనే ఆ జట్టుకు ప్రాక్టీసు సెషన్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి ఇవాళ కూడా ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేపట్టారు. ఒకవేళ మరింతమందికి కరోనా పాజిటివ్ వస్తే, రేపు జరగాల్సిన మ్యాచ్ ను రీషెడ్యూల్ చేసే అవకాశాలున్నాయి.
ఇదిలావుంటే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కరోనా బారినపడిన వారి పేర్లను బీసీసీఐ తాజాగా వెల్లడించింది. ప్యాట్రిక్ ఫర్హార్ట్, మిచెల్ మార్ష్, చేతన్ కుమార్ (స్పోర్ట్స్ మ థెరపిస్ట్), డాక్టర్ అభిజిత్ సాల్వి (టీమ్ డాక్టర్), ఆకాశ్ మానే (సోషల్ మీడియా కంటెంట్ టీమ్ మెంబర్)లకు కరోనా పాజిటివ్ వచ్చిందని వివరించింది.