బ్రిటీష్ పాలకుల అణచివేతను ఎదిరించిన అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు అని ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచి నేను ఎంతగానో అభిమానించే స్వాతంత్ర్య సమరయోధుల్లో శ్రీ అల్లూరి తొలి వరుసలో ఉంటారు. ఈరోజు విశాఖపట్నం దగ్గరలోని పాండ్రంగిలో ఉన్న ఆయన జన్మప్రదేశాన్ని దర్శించుకునే అవకాశం లభించింది. నా జీవితంలో గుర్తుంచుకోదగిన క్షణాల్లో ఈరోజు మరింత ప్రత్యేకంగా నిలుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమాల్లో యువత భాగస్వాములు కావాలి. ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛకు కారణమైన స్వరాజ్య సమరయోధుల గురించి తెలుసుకోవడమే గాక, మన చుట్టుపక్కల వారికి తెలియజేసేందుకు ఇదో మంచి తరుణం. భారతీయ యువత ఇలాంటి మహనీయుల జీవితాల గురించి తెలుసుకుని, వారి స్ఫూర్తితో నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.