కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సొంత పార్టీ బీజేపీకి చెందిన ఎంపీ సుబ్రహ్మణ స్వామి ఏకీపారేశారు. ఇదిలావుంటే ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసిన బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి.. మోదీ పాలనా తీరుపై విమర్శల వర్షం కురిపించారు. సొంత పార్టీకి చెందినా... పలు అంశాలకు సంబంధించి మోదీ సర్కారు తీరును సుబ్రహ్మణ్య స్వామి తరచూ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే తాజాగా మోదీ ఎనిమిదేళ్ల పాలనపైనా స్వామి విమర్శలు గుప్పించారు.
ప్రధానిగా ఎనిమిదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్న మోదీ దేశ ఆర్థిక పురోభివృద్ధికి సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాలను మాత్రం చేరుకోలేకపోయారని సుబ్రహ్మణ్య స్వామి కీలక వ్యాఖ్య చేశారు. అదే సమయంలో 2016 నుంచి వృద్ధి రేటు పడిపోతూనే ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక జాతీయ భద్రత గతంలో ఎన్నడూ లేనంత రీతిలో బలహీనపడిపోయిందని స్వామి విమర్శించారు. చైనాను ఎలా ఎదుర్కోవాలన్న విషయం మోదీకి అర్థమే కావడం లేదని ఆయన విసుర్లు సంధించారు. వీటన్నింటి నుంచి కోలుకునే అవకాశాలు ఉన్నాయని, అయితే వాటి గురించి మోదీకి తెలుసో, లేదోనని స్వామి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.