చెత్తపై పన్ను విధించిన ఇది పక్కా చెత్త ప్రభుత్వమేనని సీపీఐ ఏపీ రాష్ట్ర సమితి కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. విజయవాడలో వామపక్ష నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ, 16 రోజుల్లో 14 సార్లు ఇంధన ధరలు పెరిగాయని విమర్శించారు. రాష్ట్రంలో సిమెంట్, స్టీల్, అన్ని ధరలు ఎక్కువేనని అన్నారు. రాష్ట్రంలో చెత్తపై కూడా పన్ను వేశారని, ఇది పక్కా చెత్త ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో గంటల తరబడి విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. మే 1 నుంచి కరెంటు వస్తుందని చెబుతున్నారని, అదెలాగో చెప్పాలని నిలదీశారు. సీపీఎం నేత శ్రీనివాసరావు మాట్లాడుతూ... గ్యాస్, సిమెంట్, పెట్రోల్, డీజిల్ సహా అన్ని ధరలు పెంచేశారని అన్నారు. ఈ నెల 25న సచివాలయం వద్ద ధర్నా చేపడుతున్నట్టు వెల్లడించారు. డీజిల్ ధర పెరిగిందని బస్సు చార్జీలు పెంచుతున్నారని విమర్శించారు.