కాబోయే భర్త గొంతును కోసిన కేసులో మిస్టరీ వీడిపోయింది. పోలీసుల విచారణలో నిందితురాలు పుష్ప నేరాన్ని అంగీకరించింది. అనకాపల్లి డీఎస్పీ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది.పెళ్లి ఇష్టం లేకనే ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. దైవభక్తిలో ఉండిపోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేశానంటోంది పుష్ప. నిశ్చితార్ధం జరిగిన తర్వాత రామునాయుడిపై పుష్ప హత్యాయత్నానికి పాల్పడింది.
భక్తి మైకంలో పుష్ప పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలనుకున్నట్లు డీఎస్పీ సునీల్ కుమార్ వెల్లడించారు. పుష్ప ఎప్పుడూ ఏకాంతంలో ఉండేదని.. గతంలో పలుమార్లు పెళ్లి సంబంధాలు వచ్చినా తిరస్కరించినట్లు డీఎస్పీ తెలిపారు. చివరకు రాము నాయుడుతో బలవంతంగా పెళ్లికి ఒప్పుకున్నా పుష్ప.. పెళ్లి ఎక్కడ జరిపిస్తారో.. తన కల ఎక్కడ నెరవేరకుండా పోతుందో అన్న భయంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందన్నారు.ఎలాగైనా పెళ్లి ఆపాలనుకుని.. కాబోయే భర్తపై దాడి చేసి తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుందని డీఎస్పీ తెలిపారు. సర్‌ప్రైజ్ అంటూ చాకుతో గొంతు కోసిందన్నారు. తాను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటోందనని.. తనను తాను కాపాడుకుంటూ.. పుష్పను కూడా రాము నాయుడు కాపాడాడు. పుష్పను అరెస్ట్ చేసిన పోలీసులు.. 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.