నిబంధనల పేరుతో అమ్మఒడి కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యచంద్రయాదవ్ పేర్కొన్నారు.
అమ్మ ఒడి పథకం చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి వర్తింపజేయాలని, విధించిన ఆంక్షలు ఉప సంహరించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కెఎస్‌ఆర్ బాలికల పాఠశాలలో విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మ ఒడి పథకం అమలులో ప్రభుత్వం రోజురోజుకి అనేక ఆంక్షలు విధిస్తూ ఆ పథకాన్ని విద్యార్థులకు అందకుండా చేస్తోందన్నారు. పలు సాకులు చూపిస్తూ సాయాన్ని ఎగ్గొట్టే కుట్ర చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మేనమామ స్థానంలో ఉండి ప్రతి విద్యార్థి చదువుకు తోడ్పాటు అందిస్తానంటూ హామీని ఇచ్చి నేడు కుంటి సాకులు చూపడం సరికాదన్నారు. అమ్మఒడికి విద్యుత్ ఛార్జీలు ముడిపెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం పునరాలోచించి ప్రతి విద్యార్థికి అమ్మఒడి అందేలా చూడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రోడ్డపైకి వచ్చిన ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సంజీవ్, అశోక్, దూద్‌పీరా, సంపత్‌కుమార్, అష్రాఫ్‌వలి, మహమ్మద్, అజరు తదితరులు పాల్గొన్నారు.