ఓ వైపు ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు వేసవి ఉష్ణోగ్రతల కారణంగా ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు వర్షాలు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈ తరుణంలో విపత్తు నిర్వహణ సంస్థ గరిష్ట ఉష్ణోగ్రతలపై హెచ్చరికలు జారీ చేసింది. రానున్న నాలుగు రోజుల్లో ఏపీలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ బీఆర్ అంబేడ్కర్ వెల్లడించారు. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని సూచించారు. డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఓఆర్‌ఎస్, ఇంట్లో తయారు చేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయనీరు, మజ్జిగ, కొబ్బరినీరు వంటివి తాగాలన్నారు. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శనివారం వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. 23న ఆదివారం 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు.