ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు శుక్రవారం ఉలిక్కి పడ్డారు. ఇటీవల కాలంలో ఆ దేశంలో వరుస బాంబు దాడులు జరుగుతున్నాయి. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తాజాగా మసీదులో ముష్కరులు బాంబు దాడికి తెగబడ్డారు. కుందుజ్ ప్రావిన్స్‌లోని ఈ ఘటన జరిగింది. ఇమామ్ సాహిబ్ జిల్లాలోని మవ్లావీ సికందర్ మసీదుపై ఉగ్రమూకలు బాంబు దాడులతో విరుచుకుపడ్డాయి. ఈ దుర్ఘటనలో 33 మంది మృతి చెందగా, 43 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారిలో చిన్నారులు కూడా ఉండడం అందరినీ కలచి వేస్తోంది. ఈ విషయాన్ని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ధ్రువీకరించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరుపున అండగా ఉంటామని చెప్పారు. గతేడాది తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారం చేపట్టాక జరిగిన బాంబుదాడుల్లో ఇదే పెద్దది. ఈ దాడులు ఐసిస్ చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.