కిసాన్ క్రెడిట్ కార్డు రైతన్నల చేతిలో ఆర్థిక ఆయుధమని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. శనివారం బాపట్లలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో కిసాన్ క్రెడిట్ కార్డు క్యాంపెయిన్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 24వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు కిసాన్ బాగిధారి- ప్రాతమిక్త హమారీ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
జిల్లా యంత్రాంగం, జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, , నాబార్డు సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపడతారని తెలిపారు. ప్రతి రైతు భరోసా కేంద్రలో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు బ్యాంకుల ద్వారా ఎలాంటి రుణాలు పొందని అగ్రి, డైరీ, మత్స్యకార రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులపై అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ కిసాన్ క్రెడిట్ కార్డులు అందిస్తామన్నారు. ఇప్పటికే కార్డు పొందిన వారికీ, పొందని వారికీ సామాజిక భద్రత పథకాలైన పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవై, ఏపీవై వంటి సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.
కిసాన్ కార్డు లేని రైతులు తమ దరఖాస్తులను వ్యవసాయాధికారులకుగానీ, పంచాయతీ కార్యదర్శులకుగానీ, రెవెన్యూ అధికారులకుగానీ, ఆర్‌బీకేలలోగానీ అందజేయాలని సూచించారు. అర్హులైన రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయని చెప్పారు. అర్హులైన రైతులందరూ కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవాలని, ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, ఎల్‌డీఎం రాంబాబు ఈదర తదితరులు పాల్గొన్నారు.