కృష్ణా జిల్లా: ఆనుమంచిపల్లిలో చేపలకు మేత వేస్తుండగా ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతులు ఒంగోలుకు చెందిన మేడా వెంకట్రావ్(27), ఆనుమంచిపల్లికి చెందిన వల్లెపు ప్రవీణ్(21)గా గుర్తించారు. ఆనుమంచిపల్లికి చెందిన గిన్నె చెరువుపై కొంత కాలం నుంచి కాపలాదారుడిగా పని చేస్తున్న వెంకట్రావ్ భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గట్టుపైనే గుడిసె వేసుకుని నివసిస్తున్నారు.
అవివాహితుడైన ప్రవీణ్ కూలికి వెళ్తూ జీవనం సాగిస్తూ అప్పుడప్పుడు చెరువులో పనికి వెళ్తుంటారు. శనివారం సాయంత్రం వారిద్దరూ కలిసి చేపలకు మేత వేయడానికి చిన్న రేకు పడవపై చెరువు మధ్యలోకి వెళ్లారు. పడవ అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఇద్దరూ నీటిలో పడిపోయారు. ప్రవీణ్ పూర్తిగా మునిగిపోగా, వెంకట్రావ్ మునిగి, తేలుతూ కేకలు వేశారు. వెంటనే సమీప రైతులు వెళ్లి వెంకట్రావ్‌ని రక్షించారు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని అంబులెన్స్‌లో విజయవాడ తరలించారు. మార్గమధ్యలోని పరిటాల వద్ద అతను తుది శ్వాస విడిచారు.