రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనను ప్రజలకు దగ్గర చేసేందుకు పలు భవనాలను మంజూరు చేయడం జరిగిందని, నిర్మాణంలో ఉన్న భవనాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఎం. హరినారాయణన్ అన్నారు. శనివారం సాయంత్రం జిల్లాలో నిర్మాణంలో ఉన్న పలు భవనాలకు సంబంధించి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ తో కలిసి రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ లు, పాల కేంద్రాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులు మాట్లాడుతూ భవన సామాగ్రి అయిన ఇటుక, సిమెంటు, స్టీల్ ధరలు భారీగా పెరగడం జరిగిందని ఫలితంగా కాంట్రాక్టర్లు వారు ఈ సమస్యను చెబుతున్నారని అన్నారు.
జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్మాణాలు చాలావరకు పూర్తిచేసుకుని అసంపూర్తిగా ఉన్న వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానంగా 75 శాతం పైగా నిర్మాణాలు చేసుకున్నవారికి కొంత ఖర్చు చేసి వాటిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఈ సందర్భంగా మే నెల నాటికి 124 భవన నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని అధికారం కలెక్టర్ కు తెలిపారు.