ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ టోర్నీలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, ఫాఫ్ డుప్లెసిస్, కీరన్ పోలార్డ్.. లాంటి మేటి బ్యాటర్లను సైతం తన బౌలింగ్‌తో బెంబేలెత్తించాడు. పరుగులు కట్టడి చేయడంతో పాటుగా.. వికెట్లు పడగొట్టడం అతడి స్పెషల్. ఒక్క ఓవర్లోనే తన స్పిన్ మాయాజాలంతో మ్యాచును మలుపుతిప్పగలడు. ఈ క్రమంలోనే మెగా టోర్నీలో 100 వికెట్ల మార్క్ అందుకున్నాడు.
ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న రషీద్ ఖాన్.. శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టి ఐపీఎల్‌లో 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరాడు. డ్వేన్ బ్రావో (179), లసిత్ మలింగ (170), సునీల్ నరైన్ (149) తర్వాత 100 వికెట్లు తీసిన నాలుగో విదేశీ ప్లేయర్‌గా రషీద్ నిలిచాడు. మరోవైపు అమిత్ మిశ్రా, ఆశిష్ నెహ్రాతో పాటు ఐపీఎల్‌లో అత్యంత వేగంగా (83 మ్యాచ్‌లలో) 100 వికెట్లు పడగొట్టిన మూడో ఆటగాడిగాను రికార్డుల్లోకి ఎక్కాడు.
ఐపీఎల్ టోర్నీలో తన హవా కొనసాగిస్తున్న రషీద్ ఖాన్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కోచ్ బ్రియాన్ లారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రషీద్ అంతపెద్ద వికెట్ టేకరేం కాదని, అతడు లేకున్నా తాము మ్యాచులు గెలుస్తున్నాం అని అన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ విజయం సాధించిన అనంతరం స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌తో లారా మాట్లాడుతూ... 'రషీద్ ఖాన్‌పై నాకు చాలా గౌరవం ఉంది. రషీద్ ఇప్పుడు జట్టులో లేకున్నా.. మాకు సరైన కాంబినేషన్ ఉంది. రషీద్ బౌలింగ్ వేస్తున్నాడంటే.. ప్రత్యర్థి బ్యాటర్లు డిఫెన్స్ చేయాలని నిర్ణయించుకుంటున్నారు. అంతేకాని రషీద్ పెద్ద వికెట్ టేకరేం కాదు' అని అన్నారు.
'రషీద్ ఖాన్ ఎకానమీ బాగుంది. ఓవర్‌కు 5-6 పరుగులు మాత్రమే ఇవ్వడం అంటే చాలా గొప్ప. అయితే మొదటి 6 ఓవర్లలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు వాషింగ్టన్ సుందర్ లాంటి స్పిన్నర్ ఉండడం మాకు కలిసొచ్చింది. గాయపడ్డ అతని స్థానంలో సుచిత్ వచ్చాడు. అతను కూడా బాగా రాణిస్తున్నాడు. మేము ప్రతి గేమ్‌లో నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతున్నాం. రానున్న మ్యాచ్‌లలో పిచ్‌లు మారవచ్చు, స్పిన్‌కు అనుకూలంగా కావొచ్చు. ఐపీఎల్‌లో హ్యాట్రిక్ తీసిన శ్రేయాస్ గోపాల్ కూడా మాకు ఉన్నాడు. అయితే రషీద్ ఉంటే.. మేము 7 మ్యాచులకు ఏడు గెలిచి ఉండవచ్చేమో' అని బ్రియాన్ లారా పేర్కొన్నారు. ఐపీఎల్లో 2017 నుంచి 2021వరకు సన్‌రైజర్స్ తరఫున రషీద్ ఆడిన విషయం తెలిసిందే.