శిరోజాలు రాలిపోవడం అనే సమస్య నేడు ఎక్కువగా కనిపిస్తోంది. జుట్టు రాలిపోతున్నట్టు కనిపించినా నిర్లక్ష్యం చేసే వారు ఉన్నారు. అదే సమయంలో ఆందోళనతో కొత్త కొత్త ఉత్పత్తులను వాడేసే వారూ ఉన్నారు. అయినా, ఆశించిన ఫలితాలు కనిపించకపోవడం ఎక్కువ మందికి ఎదురయ్యే అనుభవం. దీనిపై డెర్మటాలజిస్ట్ డాక్టర్ గీతికా మిట్టల్ గుప్తా ఇచ్చిన సూచనలు ఇలా ఉన్నాయి.
రోజులో 50-100 వెంట్రుకలు రాలిపోవడం సాధారణమే. ఇంతకంటే ఎక్కువ రాలిపోతుంటే దానిని సమస్యగానే చూడాలి. కారణాన్ని గుర్తించి చర్యలు తీసుకోవడం ద్వారా కేశ సంపద కోల్పోకుండా చూసుకోవచ్చు. తలగడపైన సిల్క్ కవర్ ను వాడుకోవాలి. దీనికి రాపిడి గుణం తక్కువ. దీంతో వెంట్రుకలు బ్రేక్ అవ్వవు. కేశాలు స్టయిల్ గా ఉండాలని కొందరు రసాయన పదార్థాలు వినియోగిస్తుంటారు. ఇవి కేశాల ఆరోగ్యానికి మరింత హాని చేస్తాయి.
అందరికీ శిరోజాలు ఒకటే తరహాలో ఉండవు. కనుక ఎవరికి వారు వెంట్రుకల గుణానికి సరిపోలే షాంపూలు, కండీషనర్లనే వాడాలి. హెయిర్ సిరమ్ అని ఉంటుంది. దీన్ని రోజూ వినియోగించడం ద్వారా కేశాల వృద్ధిని పెంచుకోవచ్చు. వెంట్రుకల బ్రేకేజీని కూడా తగ్గిస్తుంది. శారీరక వ్యాయామం వల్ల వెంట్రుకలకు రక్త ప్రసరణ పెరుగుతుంది. మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఒత్తిడితో బాధపడుతున్నారా..? అని పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఒత్తిడి కూడా ఇందుకు దారితీస్తుంది. అలాగే ధైరాయిడ్ నియంత్రణలో లేకపోయినా జుట్టు రాలిపోయే సమస్య కనిపిస్తుంది. తగినంత నిద్ర లేకపోయినా ఈ పరిస్థితే ఎదురుకావచ్చు.
అలాగే, ఇవి కాకుండా పోషకాహార లోపం ఉందేమో చూసుకోవాలి. విటమిన్ డీ3, బి విటమిన్, జింక్ లోపం లేకుండా చూసుకోవాలి. అవసరం అయితే వైద్యులు వీటిని సూచిస్తారు. చివరిగా డ్యాండ్రఫ్ కూడా కురుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దీంతో వెంట్రుకలు రాలిపోతాయి. కనుక ఈ చర్యలు తీసుకోవడం ద్వారా కేశాల సంపద ఇనుమడిస్తుంది.