దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో కోవిడ్ కేసుల్లో పెరుగుదల ప్రజల్లో కలవరం పెంచుతోంది. రోజువారీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన వివిధ రాష్ట్రాలు మాస్క్ నిబంధనను తప్పనిసరి చేశాయి. ఇక వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో కర్నాటక మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. జూన్ తర్వాత దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ రానుందని కర్నాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ వ్యాఖ్యానించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అక్టోబర్ వరకు ఫోర్త్ వేవ్ ప్రభావం ఉంటుందని వెల్లడించారు.
ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు గతంలో కోవిడ్ ఫోర్త్ వేవ్‌పై సంచలన విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. వారు ఇచ్చిన నివేదికను మీడియా సమక్షంలో మంత్రి సుధాకర్ చదివి వినిపించారు. దాని ప్రకారం కర్నాటకలో జూన్ చివరిలో ఫోర్త్ వేవ్ ప్రారంభమవుతుందని, అక్టోబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. అందరూ దీనిపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యాక్సిన్ పొందని వారు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వ్యక్తిగత బాధ్యతగా భావించాలన్నారు.