తనను రెచ్చగొడితే సహించేది లేదని, అవసరమైతే అణుబాంబులు వేస్తామని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పేర్కొన్నారు. అణుపరీక్షల కారణంగా అమెరికా సహా తమపై ఒత్తిడి తీసుకొచ్చే వివిధ దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉత్తర కొరియా ఆర్మీ 90వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సైనిక పరేడ్ అనంతరం కీలక ప్రసంగం చేశారు. భవిష్యత్తులో అణ్వాయుధ సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో తమను ఎవరైనా రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తే అణుదాడికి కూడా వెనుకాడబోమని తెలిపారు.
తమకు యుద్ధ కాంక్ష లేదని కిమ్ జోంగ్ తేల్చి చెప్పారు. అయితే తమ దేశ సార్వభౌమిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తామని స్పష్టం చేశారు. ఈ సైనిక పరేడ్‌లో ఉత్తరకొరియా రూపొందించిన అతి పెద్ద ఖండాంతర క్షిపణి హ్వాసాంగ్–17 ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిని అమెరికాను ఉద్దేశించి రూపొందించారనే ఆరోపణలున్నాయి. అమెరికా పరిధి మొత్తంలో ఎక్కడికైనా దీనిని ప్రయోగించే సామర్థ్యం ఉంది.