దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో కరోనా కేసులు క్రమేపీ పెరుగుతున్నాయి. కొంత కాలం వరకూ రోజు వారీ కేసులు వెయ్యికి దిగువన నమోదవడంతో కరోనా తగ్గిపోయిందని అంతా భావించారు. ఒక్కసారిగా ఢిల్లీ, కేరళ వంటి రాష్ట్రాలలో కేసులు తీవ్ర రూపం దాల్చాయి. తాజాగా దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 2,927 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం నమోదైన కేసుల సంఖ్య 2,483గా ఉంది. ఇక కొత్తగా గత 24 గంటల్లో 2252 మంది కోలుకోగా, 32 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. మంగళవారం ఒక్కరోజే 21,97,082 మందికి దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ జరిగింది. ఇప్పటి వరకు మొత్తం 1,88,19,40,971 వ్యాక్సిన్ డోస్‌లు పంపిణీ జరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇలా రోజురోజుకూ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం కలవరపెడుతోంది. దీంతో పలు రాష్ట్రాలు నిబంధనలు విధిస్తున్నాయి. కోవిడ్ ఫోర్త్ వేవ్ రాకుండా అప్రమత్తం అవుతున్నాయి. మాస్క్ ధరించడం తప్పనిసరిగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఢిల్లీ, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఆ జాబితాలో ఉన్నాయి. ఇక కేంద్రం కూడా పెరుగుతున్న కోవిడ కేసుల కట్టడిపై దృష్టిసారించింది. బుధవారం ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వర్చువల్‌గా భేటీ కానున్నారు.