మయన్మార్‌లో బహిష్కరానికి గురైన నోబెల్ గ్రహీత ఆంగ్ సాన్ సూకీ బుధవారం ఆ దేశంలోని కోర్టు షాక్ ఇచ్చింది. అవినీతికి పాల్పడినట్లు తీర్పు ఇచ్చింది. ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 76 ఏళ్ల ఆంగ్ సాన్ సూకీ 6 లక్షల డాలర్ల నగదు, బంగారు కడ్డీలను లంచంగా స్వీకరించినట్లు మయన్మార్ జుంటా కోర్టు ఆరోపించింది. సూకీపై వచ్చిన 11 అవినీతి ఆరోపణల్లో ఈ కేసు మొదటిది. కేసు తీర్పు సందర్భంగా జర్నలిస్టులు కోర్టుకు హాజరుకాకుండా నిషేధం విధించారు. సూకీ తరపు న్యాయవాదులు మీడియాతో మాట్లాడకుండా ఆంక్షలు పెట్టారు. తాజా తీర్పుపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆంగ్ సాన్ సూకీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని 2021 ఫిబ్రవరిలో సైన్యం కూలదోసింది. సైనిక తిరుగుబాటు కారణంగా ఆమె ప్రభుత్వం రద్దు అయింది. దీంతో పాటు సూకీ మొత్తం 11 క్రిమినల్ కేసులను ఎదుర్కొంటోంది, ఆమె దశాబ్దాలుగా జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఆమె మిలిటరీకి వ్యతిరేకంగా ప్రజలను ప్రేరేపించిందని, కోవిడ్ -19 నిబంధనలను ఉల్లంఘించిందని ఇప్పటికే ఆమెకు ఆరేళ్ల జైలు శిక్ష విధించారు. దీంతో ప్రస్తుతం ఆమె గృహనిర్బంధంలో ఉంటోంది.