ఆ భార్యాభర్తలిద్దరికీ పెళ్లయ్యాక పెద్దలు ఫస్ట్‌నైట్ ఏర్పాటు చేశారు. అయితే తొలిరేయే వారి మధ్య తీరని చిచ్చు పెట్టింది. భార్య తనను చెప్పుతో కొట్టిందని భర్త ఆరోపించాడు. భర్త, అత్తింటి వారు తనను కొట్టి తరిమేశారని భార్య ఆరోపించింది. దీంతో కలకాలం కలిసుండాల్సిన వారు ఒక్కరాత్రికే గొడవ కారణంగా వేరయ్యారు. చివరికి వరుడి ఇంటి ముందు వధువు కుటుంబికులు ధర్నా చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
బీహార్‌లోని పాట్నాకు చెందిన విశ్రాంత రైల్వే అధికారి విజయ్ సింగ్, చమేలీ దేవి దంపతులకు రోహిత్ అనే కుమారుడు ఉన్నాడు. అతడికి స్మిత అనే యువతితో 2019లో వివాహం జరిపించారు. పెళ్లైన మూడు రోజులకే స్మిత పుట్టింటికి చేరింది. ఏం జరిగిందని తల్లిదండ్రులు అడిగితే, తనను అత్తింటి వారు హింసించారని చెప్పింది. అయితే వరుడి కుటుంబికుల వాదన మరోలా ఉంది. తమ కుమారుడిని ఫస్ట్‌నైట్ రోజే చెప్పుతో కొట్టిందని, ఇది తమకు తీరని అవమానమని పేర్కొన్నారు. ఇక అత్తింటి వారు తమ కుమార్తెను వేధించారని ఆరోపిస్తూ వధువు తల్లిదండ్రులు అల్లుడి ఇంటి ముందు ధర్నా చేపట్టారు. గత రెండు సంవత్సరాలుగా వీరికి గొడవలు జరుగుతున్నాయి. ఇక వీరి గొడవలతో ఆ చుట్టుపక్కల ఉండే వారు ఇబ్బంది పడుతున్నారు. పోలీసులు స్పందించి వారి సమస్యను పరిష్కరించాలని, రోజూ వారి గొడవలతో తమకు మనశ్శాంతి ఉండట్లేదని వాపోతున్నారు.