సీఎం వైఎస్ జగన్ పాలనలో ఏపీలో మహిళలకు రక్షణ కరువైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లాలో మహిళపై అత్యాచారం, హత్య జరిగిన ఘటనపై గురువారం ఆయన స్పందించారు. వైసీపీ అధికారం చేపట్టాక రాష్ట్రంలో 800లకు పైగా మహిళలపై అఘాయిత్యాలు జరిగాయన్నారు.
ఆయా కేసుల్లో ఒక్కరికైనా కఠినంగా శిక్షలు పడి ఉంటే మహిళలపై దాడులు చేసే వారికి భయం పుట్టేదన్నారు. ప్రభుత్వ ఉదాసీనత వల్లే రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్నాయని చెప్పారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని శిక్షించాలని టీడీపీ శ్రేణులు ఆందోళనలు చేపడుతుంటే ప్రభుత్వం తమపై కక్షగట్టిందన్నారు.
ఇదిలా ఉండగా గుంటూరు జిల్లాలో మహిళ హత్యాచారం ఘటన కలకలం సృష్టించింది. దుగ్గిరాల మండలంలోని తుమ్మపూడిలో మహిళపై అత్యాచారం చేసి, హత్య చేశారు. తొలుత సహజ మరణంగా భావించినా, పోలీసులు అత్యాచారం జరిగిందని తేల్చారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ముగ్గురు అనుమానితులు ఉన్నారు.