చర్మంపై జిడ్డు పేరుకుపోవడం, మురికి కారణంగా మొటిమలు రావడం వంటి సమస్యలకు పొద్దు తిరుగుడు గింజలతో చెక్ పెట్టవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
- పొద్దు తిరుగుడు గింజలతో తయారు చేసిన స్క్రబ్ ఉపయోగిస్తే చర్మం, చర్మరంధ్రాలు శుభ్రపడతాయి. దీంతో చర్మానికి కొత్త కళ వస్తుంది. ఇందుకోసం అరకప్పు సన్ ఫ్లవర్ గింజలను మిక్సీలో వేసి పొడిలా చేయాలి. దీనికి కొద్దిగా నీరు కలిపి చిక్కటి మిశ్రమంలా చేసుకొని గాజు సీసాలో వేసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఈ మిశ్రమంతో రోజూ ముఖాన్ని, మెడను రుద్దుకుంటూ ఉంటే చర్మం శుభ్రపడటంతో పాటు ఆరోగ్యంగా తయారవుతుంది.
- సన్ ఫ్లవర్ గింజలను రెండు నుంచి మూడు గంటల పాటు ఎండలో ఉంచాలి. ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త గరుకుగా ఉండేలా చూసుకోవాలి. దీన్ని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఇలా తయారుచేసిన పొడిని ఒక టీస్పూన్ తీసుకొని, దీనికి మరో టీస్పూన్ వెన్న తొలగించని పాలు, చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పావుగంట నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత కడిగేస్తే సరిపోతుంది. ఈ ప్యాక్ ముఖంపై పేరుకొన్న మురికిని తొలగిస్తుంది. చర్మానికి తేమను అందిస్తుంది. పొడి చర్మం సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. ఈ ప్యాక్‌ని వారానికోసారి వేసుకోవడం ద్వారా చక్కటి ఫలితం కనిపిస్తుంది.
- చర్మంపై ప్యాచెస్ మాదిరిగా అక్కడక్కడా పొడిగా ఉన్న వారికి సన్ ఫ్లవర్ గింజలతో తయారు చేసిన ఫేస్‌ప్యాక్ చక్కగా నప్పుతుంది. దీనికోసం పై పద్ధతిలో మనం తయారుచేసి పెట్టుకొన్న సన్‌ఫ్లవర్ గింజల పొడిని టీస్పూన్ తీసుకోవాలి. దీనికి కొద్దిగా గంధం పొడి, రోజ్‌వాటర్ కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత తడివస్త్రంతో ముఖం తుడుచుకొని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంపై డ్రై ప్యాచెస్ పోయి, చర్మం అందంగా కనిపిస్తుంది.