భారతదేశంలో సూర్యుడు భగభగలాడిస్తున్నాడు. ఎండలు దంచికొడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు ఉంటుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ క్రమంలో దేశంలో విద్యుత్ సంక్షోభం తలెత్తుతోంది. ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్.. ఇతరత్రా వాడకాల వినియోగం పెరిగిపోయింది. దీంతో ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ ఊహించని స్థాయికి దారితీసింది. అయితే.. డిమాండ్ కు తగ్గట్టుగా సప్లయి చేయడానికి థర్మల్ కేంద్రాల్లో బొగ్గు కొరత వేధిస్తోంది. ఫలితంగా ఈ బొగ్గుపై ఆధారపడిన రంగాలపై తీవ్ర ప్రభావం చూపెడుతోంది.దేశంలోని పలు ప్రాంతాలు విద్యుత్ సరఫరాలో అంతరాయాలను ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పరిస్థితి మరింత దిగజారుతోంది. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు బొగ్గును వేగంగా సరఫరా చేసేందుకు రైల్వే శాఖ 650 రైళ్లను రద్దు చేసింది. విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సక్రమంగా సరఫరా అయ్యేలా చూసేందుకు మే 24వ తేదీ వరకు పలు మెయిల్, ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటిలో 500 ట్రిప్పులు సుదూర ప్రాంతాలకు వెళ్లే మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ, విద్యుత్ మంత్రిత్వ శాఖలు జరిపిన సంయుక్త సమావేశం జరిగింది. ప్రస్తుత డిమాండ్ కు తగ్గట్టు ప్రతి రోజు 422 Coal Rakes నడపాలని రైల్వేని అభ్యర్థించింది. రోజుకు 415 Coal Rakes ఇస్తామని చెప్పినా.. ఈ సంఖ్య 410 Coal Rakes దాటడం లేదని తెలుస్తోంది. ఒక్కో Rake ద్వారా దాదాపు 3 వేల 500 టన్నుల బొగ్గును సరఫరా చేయవచ్చని సమాచారం.