సైబర్ ఉచ్చులోపడి సారవకోటకు చెందిన ఓ కిరాణా వ్యాపారి శుక్రవారం మోసపోయాడు. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సారవకోటలోని తరుణ్ అనే వాలంటీరుకు గురువారం గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి తాను రెవిన్యూ శాఖలో ఆర్ ఐ అని చెప్పాడు. తనకు కొంత నగదు డిపాజిట్ చేసే వ్యక్తి కావాలని కోరాడు. వెంటనే తరుణ్ మరో వాలంటీరు రమేష్ను సంప్రదించాడు. డిపాజిట్ చేసేందుకు కిరాణా వ్యాపారి సతీష్ చరవాణి నంబరు సేకరించి అవతలి వ్యక్తికి అందజేశాడు. దీంతో ఆర్ ఐ అని చెప్పిన వ్యక్తి నేరుగా సతీష్తో మాట్లాడి ఆర్డీవో బ్యాంకులో ఉన్నారని, అతనికి రూ. 40 వేలు అవసరమన్నాడు. తక్షణం డిపాజిట్ చేయాలని కోరాడు. వాలంటీర్ల ద్వారా ఈ వ్యవహారం జరగడంతో నిజమేనని నమ్మిన వ్యాపారి రూ. 30 వేలు గూగుల్పే చేశాడు. కొద్దిసేపటి తర్వాత ఆర్ఐ నుంచి నగదు తీసుకురావాలని రమేషు ను వ్యాపారి కోరడంతో తనకు ఎవరూ నగదు ఇవ్వలేదని చెప్పగా మోసపోయానని గుర్తించి లబోదిబోమన్నారు. వెంటనే ఫోన్ చేసిన వ్యక్తికి తిరిగి సంప్రదించాలని ప్రయత్నించగా స్విచ్చాఫ్ కావడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వివరాలు సేకరించగా అవి నల్గొండ జిల్లాకు చెందిన నంబర్లుగా గుర్తించారు. గూగుల్పే నంబరు గల వ్యక్తి శివసాయిగా గుర్తించి, సంప్రదించగా ఎవరో ఓ వ్యక్తి తన నుంచి నగదు తీసుకెళ్లారని, ఆయన ఎవరో తనకు తెలియదని చెప్పినట్లు వ్యాపారి పేర్కొన్నారు. దీనిపై ఎస్ఐ లావణ్య వద్ద ప్రస్తావించగా వ్యాపారి సతీష్ మోసపోయినట్లు తెలియజేశాడని, ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతామన్నారు.