ఇంకొంత సేపట్లో పెళ్లి జరుగుతుండగా వధువుపై కాల్పుల మోత మోగింది. వెడ్డింగ్ జరుగుతుండగా పెళ్లి కుమార్తె ఇంటికి వచ్చిన ఆమె మాజీ ప్రియుడు ఆమెను షూట్ చేసి పరారయ్యాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ మథుర నౌజీల్లోని ముబారిక్పుర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. ముబారిక్పుర్ గ్రామంలో గురువారం అర్థరాత్రి కాజల్ అనే అమ్మాయి పెళ్లి జరుగుతోంది. వేడుక జరిగిన తర్వాత అక్కడికి ఆమె మాజీ ప్రియుడు పిస్తోల్‌తో వచ్చాడు.
వధువుపై అతడు కాల్పులు జరిపాడు. తాను ప్రేమించిన అమ్మాయికి మరో వ్యక్తితో పెళ్లి జరగడాన్ని అతడు తట్టుకోలేకపోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. కాల్పుల శబ్దం విని వధువు గదిలోకి వెళ్లి చూడగా పెళ్లి దుస్తులో వధువు చనిపోయి ఉంది. తమ బిడ్డను చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడ్చారు. శుభకార్యం జరగాల్సిన రోజు ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రూరల్ ఎస్పీ శిరీష్ చంద్ర తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.